మద్దికల్లో రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డీఓ,
రైతులు సర్వేకు సహకరించాలి.. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలి – ఆర్డీఓ శ్రీనివాస్ రావు,
అర్జున్ సమాచారం, నవంబర్ 27, (బీమారం ప్రతినిధి).
మండలంలోని మద్దికల్ గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను మంచిర్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) శ్రీనివాస్ రావు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో రీ సర్వే ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది, సర్వే పనుల పురోగతి ఎలా ఉందనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి రీ సర్వే ప్రాధాన్యతను వివరించారు.
రీ సర్వేకు రైతుల సహకారం అవసరం.
భూ రీ సర్వే ప్రక్రియ సజావుగా పూర్తికావాలంటే రైతుల సహకారం ఎంతో అవసరమని ఆర్డీఓ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. సర్వే సిబ్బంది గ్రామానికి వచ్చిన సమయంలో రైతులు అందుబాటులో ఉండి తమ భూములకు సంబంధించిన సర్వే పనులు చేయించుకోవాలని సూచించారు. అధికారులు అడిగిన అవసరమైన వివరాలను అందిస్తూ రీ సర్వే ప్రక్రియకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. రైతులు సహకరిస్తే సర్వే పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం సాధ్యమవుతుందని తెలిపారు.
గడువులోగా పనులు పూర్తి చేయాలి.
రీ సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది పనుల్లో నిర్లక్ష్యం, జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్డీఓ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ సర్వే పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
పెండింగ్ పనులపై ఆరా.
అనంతరం భీమారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ సందర్శించారు. కార్యాలయంలో వివిధ విభాగాలకు సంబంధించిన పెండింగ్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలు, కార్యాలయ పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న పనులను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో భీమారం తహసీల్దార్ సదానందం, సర్వేయర్లు, జీపీఓలు, సంబంధిత రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.